RRR సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు గ్లోబల్ స్టార్ డమ్ వచ్చింది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన పోషించిన కొమురం భీమ్ పాత్రకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం.. 'నాటు నాటు' పాట ఆస్కార్ అవార్డ్ సాధించడంతో పలు అంతర్జాతీయ వేదికల మీద తారక్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు ఏకంగా FIFA తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం నెట్టింట వైరల్ గా మారింది.దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాళ్లు నెయ్‌మార్, కర్లిటోస్ టేవెజ్, క్రిస్టియానో రొనాల్డో ఈరోజు ఫిబ్రవరి 5న తమ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ముగ్గురికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే ఏదో మాములుగా విషెష్ చెప్పి సరిపెట్టకుండా, ఓ స్పెషల్ పోస్టర్ ను డిజైన్ చేసారు. పుట్టినరోజు అయినప్పుడు మూడ్ ఇలా ఉంటుందంటూ.. ముగ్గురూ RRR మూవీలోని ఐకానిక్ 'నాటు నాటు' హుక్ స్టెప్ వేస్తున్నట్లుగా స్కెచ్ ఆర్ట్ ను రూపొందించారు. అంతేకాదు ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరాలను హైలైట్ చేస్తూ.. NTR అనే వచ్చేలా వారి ఇమేజెస్ ను జోడించారు.NTR పేరుతో నాటు నాటు స్టెప్పులతో ఫిఫా ప్రపంచ కప్ డిజైన్ చేసిన ఈ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే ఈ పోస్టుకి 166K పైగా లైక్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్ లో FIFA పేజీకి 50 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే లక్షల కొలదీ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ పోస్టుపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ''హాహా.. హ్యాపీ బర్త్ డే నెయ్‌మార్, టేవెజ్, రొనాల్డో'' అని కామెంట్ పెట్టారు. ఇదే క్రమంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ స్పందిస్తూ.. మూడు హార్ట్ సింబల్స్‌ను పోస్ట్ చేసింది.

0 Comments