తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ప్రతి ఏటా భక్తులు భారీగా తరలివస్తుంటారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనాలకు కేవలం రెండు రోజులు మాత్రమే అనుతించేవారు.. ఆ తర్వాత 10 రోజుల పాటూ దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ దర్శనాల కోసం టీటీడీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టోకెన్లను విడుదల చేస్తుంది. తిరుపతి, తిరుమలలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి.. వైకుంఠ ద్వార దర్శనం SSD టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది. ఈ టికెట్ల కోసం భక్తులు భారీగా తరలివస్తారు.. ఈ క్రమంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.



తిరుపతిలో తొక్కిసలాట ఘటన తర్వాత.. వైకుంఠ ద్వార దర్శనాలపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైకుంఠ ఏకాదశి రోజే దేవుడ్ని దర్శించుకోవాలనడం ఏంటి అని గరికపాటి ప్రశ్నించారు. ' వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల, శ్రీశైలం ఆలయాలు పట్టవు.. అదే రోజు, అదే ముహూర్తం, ఏంటా పిచ్చి.. వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు వెళ్లండి.. మూడు రోజులకు వెళ్లండి.. విష్ణుమూర్తి ఏమైనా కోపడ్డతాడా.. ఉత్తరద్వారం నుంచి వెళ్లాలి.. తలుపులు బద్దలైపోవాలి. మనసు నిండా మట్టిని పెట్టుకుని.. దేవుడ్ని ఆ రోజే చూడాలి, అలాగే వెళ్లాలి, ఏదైనా సరే వెళ్లాలంటే ప్రమాదాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు, పుణ్య తీర్థాలు మాత్రమే కాదు.. శరీరాన్ని మంచిన క్షేత్రం లేదు.. మనసును మించిన తీర్థం లేదు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు నువ్వే ఓ పుణ్యక్షేత్రం.. నీకు నువ్వే పుణ్య తీర్థం'అన్నారు.

కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను ట్వీట్ చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలకు వెళ్లేవారిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటున్నారు. 'ఫలానా ఏకాదశి రోజునే వెళ్లాలి.. ఫలానా తిథి రోజే వెళ్లాలి అనుకునేవాళ్ళకి ఈ వివరణ అంకితం.ఏ రోజున వెళ్లినా దేవుడు ఒకేలాగా చూస్తాడు.. దయచేసి ప్రాణాలకి తెగించి మాత్రం వెళ్లమాకండి' అంటూ ట్వీట్ చేశారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్లడం తప్పులేదని.. కాకపోతే ఇలా ప్రాణాలు పోయేవరకు తెచ్చుకోవద్దు అంటున్నారు. గరికపాటి ఆరోజే చెప్పారంటూ కొందరు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.