గేమ్ చేంజర్ సినిమా రివ్యూ: పాత ఆటే ... నో చేంజ్‌


ఒకే న‌దిలో రెండుసార్లు నీళ్లు తాగ‌లేవు. కొత్త‌నీళ్లు వ‌చ్చి పాత‌ని తరిమేస్తూ వుంటాయి. సినిమా కూడా అంతే. అప్‌డేట్ కాక‌పోతే అవుట్‌డేట్ అయిపోతారు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప‌రిస్థితి ఇదే.

సామాజిక దృక్ప‌థం వుంటే చాల‌దు. స‌మాజంలో వ‌స్తున్న మార్పుల్ని గ‌మ‌నించాలి. ప్రేక్ష‌కులు కూడా సొసైటీలో భాగ‌మే. వాళ్లు వేగంగా మారుతున్నారు.

ఇది తెలియ‌కుండా పాత క‌థ‌ని పాత క‌థ‌నంతోనే తీస్తే అది గేమ్ చేంజ‌ర్ సినిమా. ఆట మారాలంటే స‌రిగా ఆడాలి. పాత క‌థ‌తో వ‌చ్చినా క‌నీసం క‌థ‌న‌మైనా కొత్త‌గా వుండాలి.

గేమ్ చేంజ‌ర్ సినిమాపై ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. భారతీయుడు-2 (ఇండియన్ -2) చూసిన త‌రువాత శంక‌ర్‌పై న‌మ్మ‌కం పోయింది.

అయితే, త‌న పాత్ర‌ని రాంచ‌ర‌ణ్‌, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌ని దిల్‌రాజు న‌మ్మారు. నిజానికి అవి రెండూ బాగున్నాయి. అయితే, ఏం జ‌రిగింది?

సినిమాలో రాంచ‌ర‌ణ్‌కి అన్‌ప్రిడిక్ట‌బుల్ అనే డైలాగ్ వుంది. అయితే ఇంట‌ర్వెల్ ట్విస్ట్ త‌ప్ప మిగ‌తా అంతా ప్రిడిక్ట‌బుల్‌. ట్రయిలర్ చూస్తే దాదాపు సినిమాని వూహించవచ్చు.

కథ‌ ఏమంటే..?

రాంనందన్ (హీరో) నిజాయితీగల ఐఏఎస్ అధికారి. విశాఖ కలెక్టర్‌గా వచ్చిన వెంటనే బ్లాక్ మార్కెట్, అక్రమ కట్టడాలు, ఇసుక తవ్వకాలు...అన్ని అవినీతి పనుల మీద ఉక్కుపాదం మోపుతాడు.

ముఖ్యమంత్రి (శ్రీకాంత్) కుమారుడు మోపిదేవి (సూర్య) అవినీతి మంత్రి. రాంనందన్ పనులు అత‌నికి కోపం తెప్పిస్తాయి. ఇద్దరి మధ్య ఘర్షణ‌.

ఇంతలో హీరో లవ్ ఎపిసోడ్ ఫ్లాష్‌బ్యాక్‌. ఆ త‌ర్వాత హీరోయిన్ (కైరా అద్వానీ)ని వెతికి క‌లుసుకుంటాడు. ఆమె న‌డుపుతున్న శరణాలయంలో పార్వ‌తి (అంజ‌లి) అనే పెద్దావిడ వుంటారు.

ఆమె ముఖ్య‌మంత్రికి విన‌తిప‌త్రాలు రాస్తూ మ‌తిస్థిమితం లేకుండా వుంటుంది. పార్వ‌తి కోరిక మేర‌కు ముఖ్యమంత్రి సభకి హీరో తీసుకెళతాడు. ఆమెకి ముఖమంత్రికి వున్న సంబంధమేంటి? హీరో ఎవరు? ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఏంట‌నేది మిగతా కథ.

సెకెండాఫ్‌లో పార్వతి ఫ్లాష్ బ్యాక్, హీరో, విలన్ల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్, కథ‌ ఎలా ముగుస్తుందో ఎవరైనా సులభంగా అంచనా వేయొచ్చు.

శంకర్ ఒకప్పటి గొప్ప దర్శ‌కుడే. సందేహం లేదు. క్యారెక్టర్ రాసుకోవడం, కథ‌నాన్ని బిగువుగా నడపడంలో దిట్ట. పాటల్ని భారీగా పిక్చరైజ్ చేయడం ఆయన ప్రత్యేకత. వ్యవస్థలోని లొసుగుల్ని ఎత్తి చూపుతూ కమర్షియల్ ఫార్మాట్‌లోనే సందేశాన్ని ఇచ్చేవాడు.

అయితే ఒకే ఒక్కడు కాలానికి గేమ్ చేంజ‌ర్‌కి మధ్య 25 ఏళ్ళ తేడా వుంది.

హీరో ఫైట్, ఇంట్రో సాంగ్‌, హీరోయిన్ పరిచయం, లవ్ ట్రాక్, కామిడీ బిట్స్, విలన్ ఎంట్రీ, ఇద్దరి మధ్య ఘ‌ర్ష‌ణ‌, ఇంటర్వెల్ బ్యాంగ్‌, సెకండాఫ్ ఫ్లాష్‌ బ్యాక్, గొడ‌వ ముద‌ర‌డం, హీరోకి కొన్ని కష్టాలు, క్లైమాక్స్ ఫైట్, ఐదారు పాట‌లు... ఈ ఫార్మాట్ తుప్పు పట్టింది.

కత్తికి సానబెడితేనే పదును..క‌థైనా అంతే. రెండు నిమిషాల షార్ట్స్, రీల్స్ ల్యాగ్ అయితేనే భరించలేని కొత్త జనరేషన్. రెండు గంటల నలభై అయిదు నిమిషాలు థియేటర్లో కూర్చోపెట్టాలంటే ఎంత మ్యాట‌ర్ వుండాలి.

రామ్ చరణ్

ఫొటో సోర్స్,Ram Charan/Twitter

జెంటిల్‌మెన్‌లో విద్యా వ్యవస్థ, ఒకే ఒక్క‌డులో రాజ‌కీయ సిస్టం, భారతీయుడు, అపరిచితుడులో అవినీతిపైన అస్త్రాలు ఎక్కుపెట్టి శంకర్ విజయం సాధించాడు. ఆ సినిమాల్లో రైటింగ్ బలంగా వుంటుంది.

పాత్రచిత్రణ అద్భుత‌మైన ఎమోషన్స్‌తో మిక్స్ అయి వుంటుంది. కూతురికి కాగితం పడవ కోసం 500 నోటు ఇచ్చిన కమలహాసన్ (భారతీయుడు), అదే కూతురిని బ‌తికించుకోడానికి డాక్టర్‌కి పైసా లంచం ఇవ్వడు. అవినీతికి అలవాటైన సొంత కొడుకుని కూడా వదిలిపెట్టడు. క్యారెక్టర్ బలంగా వున్నపుడు నటులు కూడా రెచ్చిపోతారు.

గేమ్ చేంజర్‌లో సమస్య ఇదే. రైటింగ్ బలహీనంగా వుంది. సాయిమాధవ్ బుర్రా డైలాగ్‌లు అక్కడక్కడ పేలినా, కథలో విషయం లేనపుడు, డైలాగులతో సినిమా గట్టెక్క‌దు.

రాంచరణ్, సూర్య అద్భుతమైన నటనని చూపినా, రొటీన్ కథ కావడంతో తేలిపోయింది. కైరా అద్వానీకి నటించే అవకాశం లేదు. వూరికే నిలబడి ఒకటో రెండో డైలాగులు చెప్పడమే.

అంజలి పరిస్థితి కూడా అంతే. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సత్య ఎందరో వున్నా కామెడీ వ‌ర్కౌట్ కాలేదు.

సునీల్ ఒకవైపు చూస్తూ, ఇంకో వైపు నడిచే సైడ్ సత్యం కూడా నవ్వించలేదు. బ్రహ్మానందం కాసేపు క‌న‌బ‌డినా లాభంలేదు. వున్నంతలో జయరాం బెట‌ర్‌.